పోసానికి వరుస షాకులు.. పది రోజులు రిమాండ్.. గుంటూరు జైలుకు తరలింపు..

పోసానికి వరుస షాకులు.. పది రోజులు రిమాండ్.. గుంటూరు జైలుకు తరలింపు..

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు పది రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణ మురళిపై టీడీపీ నేత కిరణ్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పల్నాడు జిల్లా పోలీసులు.. పోసానికి పీటీ వారెంట్ జారీ చేశారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో పల్నాడు పోలీసులు పోసాని కృష్ణ మురళిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట న్యాయస్థానం మార్చి 13 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసాని కృష్ణ మురళిని పల్నాడు పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. పీటీ వారెంట్‌పై రేపు బాపట్లకు తరలించనున్నట్లు తెలిసింది.

మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణ మురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సోమవారం కూడా మరో రెండుచోట్ల ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. యాదమర్రి, పుత్తూరు పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇవే ఆరోపణలపై అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. అయితే పల్నాడు జిల్లాలో కేసులు నమోదు కావటంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు రాజంపేట పోలీసుల అనుమతితో పోసానిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుఫు న్యాయవాదులు కడప కోర్టులో పిటిషన్లు వేశారు. అటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లపైనా కోర్టు విచారణను వాయిదా వేసింది. ఐదో తేదీ ఈ పిటిషన్లను విచారించనుంది. మరోవైపు అనారోగ్యం కారణంగా తనను జిల్లా జైలుకు పంపాలని పోసాని కోరినట్లు తెలిసింది. దీనికి న్యాయమూర్తి అంగీకరించారని సమాచారం. దీంతో పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట సబ్ జైలుకు కాకుండా.. గుంటూరు జిల్లా జైలుకు పోసాని కృష్ణ మురళిని తరలించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these