Mega DSC 2025 Notification: అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన.. ఏమన్నారంటే?

Mega DSC 2025 Notification: అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన.. ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సమాధానమిస్తూ.. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తిచేయాలంటే రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని, మన బడి-మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హమీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే క్యాంపెయిన్‌ను ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి పాఠశాల, కాలేజీల్లో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని మంత్రి లోకేష్‌ వివరించారు.

గతంలో తీసుకువచ్చిన 117 జీవోతో నిరుపేదలు విద్యకు దూరం అయ్యారని అన్నారు. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని మంత్రి లోకేష్‌ తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గల కోసం సభ్యులతో చర్చించాలని, సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా పాఠశాలల వద్ద సీసీ టీవీలు, లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఆఫ్ ఏపీ కింద సీఎస్ఆర్ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

కాగా ఇప్పటికే కూటమి సర్కార్‌ డీఎస్సీ సిలబస్‌ విడుదల చేయగా.. ఈ మార్చి నెలలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను ఎలాంటి చిక్కులు, అడ్డంకులు ఉండ‌కుండా జారీ చేసేందుకు, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 16,371 టీచ‌ర్ పోస్టుల్లో.. 6,371 సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు, 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌ పోస్టులు, 52 ప్రిన్సిపల్‌ పోస్టులు, 132 పీఈటీ టీచ‌ర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these