ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ ద్వారా సమాధానం చెప్పింది. అదేంటంటే.. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తున్నారా లేదా అన్నది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అందిస్తామని తెలిపింది. వారి అకౌంట్లలో డైరెక్టుగా రూ.20,000 జమ చేయబోతోంది.
ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా ఆయన 2 విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి.. ప్రతీ రైతుకీ రూ.20,000 చొప్పున ఇస్తామన్నారు. ఐతే.. ఈ పథకం పీఎం కిసాన్ పథకంతో లిక్ అయ్యి ఉంటుంది. అందువల్ల పీఎం కిసాన్ కింద రైతుకు ఇస్తున్న రూ.6,000 కాకుండా.. మిగతా రూ.14,000లను ఏపీ ప్రభుత్వం ఇస్తుంది అని స్ఫష్టంగా చెప్పారు. మరో విషయం కూడా చెప్పారు.
పీఎం కిసాన్ అనేది.. భూమి ఉన్న రైతులకు మాత్రమే వస్తుంది. మరి ఏపీలో భూమి లేని, భూమిని కౌలుకు తీసుకున్న రైతుల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనికి మంత్రి కచ్చితమైన సమాధానం ఇచ్చారు. భూమి లేని కౌలు రైతులకు కూడా రూ.20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఐతే.. దీనికి పీఎం కిసాన్తో లింక్ ఉండదు కాబట్టి.. ఆ రైతులకు ఏపీ ప్రభుత్వమే పూర్తిగా రూ.20,000 ఇస్తుంది అన్నారు.
మంత్రి చెపిన దాని ప్రకారం.. పీఎం కిసాన్ పథకం పొందే రైతులు ఏపీలో సంవత్సరానికి రూ.14,000 చొప్పున పొందుతారు. ఐతే.. ఇది ఎన్ని విడతల్లో ఇస్తారో ప్రభుత్వం ఇంకా వివరంగా చెప్పలేదు. త్వరలో దీనిపై విధి విధానాలు, పూర్తి వివరాలను ప్రభుత్వం చెబుతుంది. అలాగే.. కౌలు రైతులు సంవత్సరానికి రూ.20,000 చొప్పున పొందుతారు. ఈ డబ్బును కూడా ఎన్ని విడతల్లో ఇస్తారో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు.