Posani Krishna Murali: పోసాని అరెస్ట్.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

పోసాని అరెస్ట్.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ గురించి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మీద ఏపీవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఐడీ కూడా కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోసానిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజంపేట తరలిస్తున్నట్లు తెలిసింది.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గతేడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కూడా పోసానిపై కేసు నమోదు చేశారు. 2024 సెప్టెంబర్‌ నెలలో ఓ మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలుచోట్ల పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

మరోవైపు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు గతేడాది నవంబర్‌లో తనపై టీడీపీ కూటమి శ్రేణుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనంటూ పోసాని కృష్ణ మురళి సంచలన ప్రకటన చేశారు. జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని.. దూరంగా ఉంటానంటూ అప్పట్లో ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these