ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో కూటమి ప్రభుత్వమే ఐదు స్థానాలను కైవసం చేసుకోనుంది. యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, జంగా కృష్ణమూర్తి, రామారావు, మార్చి 3న నోటిఫికేషన్ విడుదలకానుంది.మార్చి 20వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే ఈ ఐదుగురిలో ఎవరికి రెన్యువల్ అవుతుందన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఈసారి అవకాశం ఇచ్చేందుకు అధినాయకత్వం మొగ్గు చూపడం లేదని తెలిసింది.
మూడు మాత్రమే టీడీపీకి…
ఐదు ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి ఇప్పటికే జనసేనకు రిజర్వ్ అయింది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇక నాలుగు పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరొకటి పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నేత వర్మ, విజయవాడ నేత వంగవీటి రాధా పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈ పోస్టులకు టీడీపీ నుంచి గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారి నుంచి కూడా భారీగా పోటీ ఏర్పడింది. దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వారు ఎమ్మెల్సీ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. సో.. దీంతో మరోసారి యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తికి రెన్యువల్ చేసే అవకాశం కనిపించడం లేదు.
సీనియర్ నేతలకు…
జంగా కృష్ణమూర్తికి ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడంతో ఎమ్మెల్సీ పదవికి మరో బీసీకి అప్పగించాలన్న నిర్ణయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. ఆయన పేరును టీటీడీ బోర్డుకు పరిశీలన చేసినప్పుడే ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయబోమని చంద్రబాబు స్పష్టంగా హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక యనమల రామకృష్ణుడికి ఎటు చూసినా ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేసే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే యనమల కుటుంబానికి ఇప్పటికే రెండు ఎమ్మెల్యే పోస్టులు, ఒక ఎంపీ పోస్టు ఇవ్వడంతో మరొకటి అదే కుటుంబానికి ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు.
గ్యాప్ పెరగడంతో…
దీంతో పాటు యనమల రామకృష్ణుడుకు, పార్టీ అధినాయకత్వానికి మధ్య ఇటీవల గ్యాప్ పెరిగింది. బీసీ విషయంలోనూ, కాకినాడ పోర్టు అంశంలోనూ యనమల చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెట్టాయి. అలాగే కొత్త రక్తానికి అవకాశమివ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల నారా లోకేశ్ కూడా ఒకే వ్యక్తికి రెండుసార్లు మాత్రమే పదవి లభిస్తుందని, మూడో సారి మాత్రం త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పడం కూడా యనమలకు రెన్యువల్ కాదన్నది తేలిపోయింది. ఆయన తుని రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. తునిలో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఎమ్మెల్యే గా ఉండటంతో ఆయన అక్కడే ఇక రాజకీయాలు చేసుకోవాలని పార్టీ హైకమాండ్ సూచించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.