ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని, సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే, ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం పవన్ కల్యాణే. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు.తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడనని ఆయన చెప్పుకున్నారు.
హిందూ ధర్మాన్ని కాపాడటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చాలా గొప్పగా మాట్లాడారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు, వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
అయితే ఎలక్షన్ కోడ్‌తో తమకు ఎలాంటి పని లేదని చెబుతున్నారు జనసేన నాయకులు. పిఠాపురం పాదయాత్ర క్షేత్రంగా వెలుగొందుతున్న ఉమా రాజరాజేశ్వరీ సమేత కుక్కుటేశ్వరస్వామి వారి కళ్యాణం సోమవారంఅంగరంగ వైభవంగా జరిగింది.అయితే ఈ దేవుడి కార్యక్రమాన్ని కొందరు రాజకీయం చేయాలని చూశారు. స్వామి వారి కళ్యాణానికి పిఠాపురం జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులు వచ్చారు. దీంతో జనసేన కార్యకర్తలు కాస్తా అతి చేశారు.
మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులను వేదికపై ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని అధికారులు ఎంత చెప్పినప్పటికీ జనసేన కార్యకర్తలు మర్రెడ్డి శ్రీనివాస్‌ని పైకి తీసుకురావాలని ఒత్తిడి చేశారు.ఎప్పుడైతే జనసైనికులు వాదనకు దిగారో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే తమకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఈవో..అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్చకులే కళ్యాణం నిర్వహించారు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటనపై వైసీపీ నాయకులు పవన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కడో పోరాటం చేయడం కాదని, ముందు ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ వైసీపీ నాయకులు చరకులు అంటిస్తున్నారు.