ఏపీలో కూటమి ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన రెండు కీలక పథకాల హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పథకాల లబ్దిదారులు 8 నెలలుగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో తల్లికి వందనంగా పేరు మారిన అమ్మఒడి పథకం, అన్నదాత సుఖీభవగా పేరు మారిన రైతు భరోసా ఉన్నాయి. ఈ రెండు పథకాల అమలుపై ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. దీనికి కొనసాగింపుగా మంత్రి నారా లోకేష్ మండలిలో కీలక ప్రకటన చేసారు.
ఇవాళ శాసన మండలి సమావేశాలు వాడీవాడిగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసిందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సమాధానం ఇచ్చారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటన చేశారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. అలాగే కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ లోపు అమలు చేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం పథకాన్ని విద్యాసంవత్సరం ప్రారంభంలోపే ఇచ్చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లోనే ఈ రెండు పథకాలు అమలు చేసి తీరుతామని లోకేష్ చేసిన ప్రకటన లబ్దిదారుల్లో సంతోషం నింపుతోంది.