ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు.దివంగత సీఎం వైఎస్ఆర్ హయంలో శైలజానాథ్ మంత్రిగా పని చేశారు.ముఖ్యంగా రాజశేఖరరెడ్డి అనుచరుడుగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం ఆ బాధ్యతలు నుంచి శైలజానాథ్ తప్పుకున్నారు. షర్మిల కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఆ పార్టీకి దూరం అయ్యారు. గత నెలలోనే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.
తాజాగా మరో కాంగ్రెస్ నేత కూడా వైసీపీలో చేరడానికి చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవల జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. జగన్ను చూసి ప్రభుత్వం భయపడుతోందని అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ హర్షకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇష్టమని, అయితే అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో మూడు సీట్లు వచ్చిన బీజేపీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతిని హర్షకుమార్ గుర్తు చేశారు. ఇక్కడ సీట్ల సంఖ్య ప్రాతిపదిక కాదని, ప్రతిపక్ష పార్టీ ముఖ్యమని ఆయన తెలిపారు. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రూప్ 2 అభ్యర్ధుల్ని చంద్రబాబు అత్యంత దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. గ్రూప్ 2 విషయంలో ఏ విధంగా డ్రామా ఆడారో చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ విడుదల చేశారు. వాస్తవానికి పవన్ , బాలకృష్ణ కంటే చంద్రబాబే గొప్ప నటుడని సెటైర్లు వేశారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రూప్ అభ్యర్ధులు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. హర్షకుమార్ మాటలు విన్న తర్వాత ఆయన కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమనే భావనకు రాజకీయ పరిశీలకులు వచ్చేశారు. త్వరలో హర్షకుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారంపై హర్షకుమార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.