Andhra Pradesh : మార్చి నెల వస్తుందంటే మంత్రుల గుండెల్లో దడ.. రీజన్ అదేనా?

మార్చి నెల వస్తుందంటే మంత్రుల గుండెల్లో దడ.. రీజన్ అదేనా?

మార్చి నెల ఇంకో నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది. మార్చి నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో కొందరు మంత్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే మార్చి నెల గంగడం పొంచి ఉందని ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలోకి చేర్చుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తుంటంతో కొత్త వారికి అవకాశమిస్తారని జోరుగా టీడీపీలో ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు పెద్దగా భయం లేదు కానీ టీడీపీకి చెందిన మంత్రులే భయపడిపోతున్నారు.

యువతకు అవకాశం కల్పించినా…

అయితే మంత్రి వర్గం ఏర్పడి కేవలం తొమ్మిది నెలలవుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక మంది మంత్రులు పనితీరులో వెనకబడి ఉండటమే కారణం. సామజికవర్గంతో పాటు వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కొత్తగా ఎన్నికయిన వారు అంటే మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారికి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. యువకులయితే మరింత బాగా పనిచేస్తారని, తమకు కేటాయించిన శాఖలపై పట్టుసాధించడమే కాకుండా, తమకు అప్పగించిన జిల్లాలకు సంబంధించి కూటమి నేతల మధ్య సయోధ్య కుదురుస్తారని ఆయన గట్టిగా నమ్మారు. మరొక వైపు తనతో పాటు యువకులైతేనే పాలనలో పరుగులు పెడతారని నమ్మారు. కానీ ఊహించని దానికి విరుద్ధంగా జరుగుతుంది.

మంత్రుల పనితీరుపై…

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కనీసం ఫైళ్ల క్లియరెన్స్ లోనూ కొందరు మంత్రులు వెనకబడి ఉన్నారు. మరికొందరు మంత్రులు కేవలం బుగ్గకారులోనే తిరుగుతూ విపక్షం చేసే విమర్శలకు కూడా స్పందించడం లేదు. తన పేషీలపై కూడా పట్టులేకుండా కొందరు మంత్రుల వ్యవహరిస్తుండటాన్ని చంద్రబాబు గమనించారు. ఆయన ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుపై నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఈ ప్రకారం చూస్తూ నాగబాబుతో పాటు నలుగురైదుగురు మంత్రులపై వేటు పడే అవకాశముందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. వారి స్థానంలో సమర్థులైన వారిని నియమిస్తూ మరింతగా పాలన గాడిన పడుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.

తెలిసిన మంత్రులు కొందరు…

ఈ విషయం తెలిసిన కొందరు మంత్రులు ఇప్పుడిప్పుడే ఆకస్మిక తనిఖీలు, విపక్ష నేతపై విమర్శలు వంటివి చేస్తున్నారు. జగన్ ను తిడితే తమ పదవి పదిలంగా ఉంటుందని భావించి కొందరు అలా మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబుకు అన్నీ తెలుసు. ఏ మంత్రి పనితీరు ఎలా ఉందో? ఇప్పటి వరకూ జిల్లాల్లో వారు చేసిన పనులతో పాటు శాఖల్లో తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రత్యేకించి నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు అందుకు తగినట్లు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పడే వేటు వేయకపోతే ఇక భవిష్యత్ లో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ప్రజల్లో కూడా చులకన అయ్యే ప్రమాదం ఉందని భావించినచంద్రబాబు ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these