Andhra Pradesh : ఆరోగ్యశ్రీకి మంగళం.. ఏపీలో కొత్త పథకం రెడీ

ఆరోగ్యశ్రీకి మంగళం.. ఏపీలో కొత్త పథకం రెడీ

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకానికి ప్రభుత్వం స్వస్తి చెప్పేందుకు సిద్ధమయింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఖజానాకు భారంగా మారడంతో ఈనిర్ణయం తీసుకుంటున్నట్లు గతంలోనే చంద్రబాబు అధికారులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. అందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తే ఖజానాపై భారం తగ్గుందని, తద్వారా బీమా కంపెనీలు ఇచ్చే సొమ్ముతో ప్రజారోగ్యాన్ని పరిరక్షించవచ్చని చంద్రబాబు భావించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య బీమా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకం బాగా పాపులర్ అయింది. అయితే దానివల్ల కార్పొరేట్ ఆసుపత్రులకు ఏటా వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఇబ్బందిగా మారింది.

ఖాజానాకు భారంగా మారడంతో… ప్రస్తుతం కొత్తగా ఏర్పాటయిన కూటమి ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ తెల్లఏనుగులా తయారైంది. ప్రజల్లో బాగా పాపులర్ అయిన ఈ పథకాన్ని తొలగించాలా? వద్దా? అన్న దానిపై చాలా వరకూ సమాలోచనలు జరిపి ఏ రకంగానైనా ప్రజారోగ్యాన్నికాపాడుకోవాడానికి మరొక కొత్త పథకంతో ముందుకు వస్తే తప్ప ఈ భారం నుంచి బయటపడలేమని చంద్రబాబు భావించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేశారు. అంతా ఓకే అయితే ఏప్రిల్ నెల నుంచి ఆరోగ్య శ్రీ స్థానంలో ఆరోగ్య బీమా పథకం అమలులోకి వచ్చే అవకాశముంది. అయితే బీమా కంపెనీలు క్లెయిమ్ ల విషయంలో ఆలస్యం చేయకుండా కూడా ముందుగానే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఆరుగంటల్లోనే క్లెయిమ్… కేవలం ఆరు గంటల్లోనే క్లెయిమ్ అయ్యేలా బీమా కంపెనీలకు చంద్రబాబు క్లియర్ కట్ గా ఆదేశించారు. అయితే ఏపీని రెండు యూనిట్లుగా విభజించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకూ ఒక యూనిట్ గా, గుంటూరు నుంచి మిగిలిన జిల్లాలను మరొక యూనిట్ గా గుర్తించనున్నారు. ఈ రెండు యూనిట్లకు వేర్వేరుగా టెండర్లు పిలిచి బీమా కంపెనీలను ఆహ్వానిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ఏడాదికి 25 లక్షల వరకూ ఉచిత చికిత్సలను అందిస్తున్నట్లుగానే ఈ ఉచిత బీమాతో కూడా ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకూ ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత బీమా వర్తింప చేసేలా చర్యలు తీసుకునే అవకాశముంది. ఏడాదికి రెండున్నర లక్షల మేరకేఉచితంంగా వైద్య సేవలు అందుతాయి. ఆపైన అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించారు. మరి బీమా కంపెనీలు ఈ కొత్త విధానంలో ప్రజలను ఏ మేరకు సంతృప్తి పరుస్తాయి? ఇబ్బంది పెడతాయన్నది చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఏప్రిల్ నుంచి కొత్త ఉచిత బీమా పథకం ఏపీలో అమలు కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these