రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి సమావేశాల్ని సుదీర్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే తిరిగి అసెంబ్లీకి రావాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. గతంలో ఏడు నెలల క్రితం ప్రభుత్వం విపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీకి బాయ్ కాట్ చేసి వెళ్లిపోయిన జగన్.. ఆ తర్వాత తిరిగి రాలేదు. అయితే తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ .. జగన్ వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే రూల్స్ ప్రకారం వేటు వేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
అనర్హత వేటు భయంతోనే జగన్ అసెంబ్లీకి తిరిగి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. విపక్ష హోదా ఇవ్వకుండా అవమానిస్తున్నా ప్రజాసమస్యల ప్రస్తావన కోసమే జగన్ అసెంబ్లీకి వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతే తప్ప ఎవరికో భయపడి మాత్రం అసెంబ్లీకి రావడం లేదని తెలిపారు. తద్వారా జగన్ నిర్ణయం వెనుక అసలు కారణం ఆయన చెప్పేశారు.
మరోవైపు తాజాగా గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో జగన్ కు తగిన భద్రత కల్పించకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరతామంటూ వ్యాఖ్యానించారు.
అలాగే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతోందని సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని, గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, మిర్చి రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని సుబ్బారెడ్డి విమర్శించారు.