ఏపీలోని మహిళలకు ఉమెన్స్ డే గిఫ్ట్..! సిద్ధం చేస్తున్న ప్రభుత్వం..

ఏపీలోని మహిళలకు ఉమెన్స్ డే గిఫ్ట్..! సిద్ధం చేస్తున్న ప్రభుత్వం..

రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో ప్రత్యకే యాప్ తీసుకువచ్చే ఆలోచన చేస్తోంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ ఉన్నతాధికారులతో హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని హోం మంత్రి ఆదేశించారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందన్న వంగలపూడి అనిత.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై హోం మంత్రి చర్చించారు. ఈ సందర్భంగానే ‘సురక్ష’ పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని.. అందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం సహా వారికి ట్రైనింగ్ ఇవ్వాలని హోం మంత్రి ఆదేశించారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఛార్జ్ షీట్లు పకడ్బందీగా తయారు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి జిల్లాలో సురక్ష టీములు పెంచి 24 గంటలు నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. 112, 181, 1098 వంటి హెల్ప్ లైన్లపై ప్రజల్లో అవగాహన పెంచాలని., ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గర కావాలని సూచించారు.

రాష్ట్రంలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, డ్రోన్ల వినియోగం పెంచాలన్నారు. సోషల్ మీడియాలో మహిళలను అసభ్య పదజాలంతో దూషించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా వాడకంపై యువతలో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని హోం మంత్రి స్పష్టం చేశారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపిన వంగలపూడి అనిత.. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these