YS Jagan: చంద్రబాబు గారూ.. టీడీపీ కూటమి సర్కారు కక్షలు తీర్చుకోవడానికి వ్యవస్థలను వాడుకుంటోందని..వైఎస్ జగన్

చంద్రబాబు గారూ.. టీడీపీ కూటమి సర్కారు కక్షలు తీర్చుకోవడానికి వ్యవస్థలను వాడుకుంటోందని..వైఎస్ జగన్

న్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ మీద మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం కేసులో టీడీపీ ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించిందంటూ జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చారని.. అయితే దాన్ని కూడా మార్చేయడానికి దుర్మార్గాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

టీడీపీ కూటమి సర్కారు కక్షలు తీర్చుకోవడానికి వ్యవస్థలను వాడుకుంటోందని.. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అని జగన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని జగన్ ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్న జగన్.. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై కేసు గురించి కూడా జగన్ ప్రస్తావించారు. అబ్బయ్య చౌదరిపై కేసును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు.

అబ్బయ్య చౌదరి డ్రైవర్‌‌ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిడితే.. తిరిగి అబ్బయ్య చౌదరిపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమని వైఎస్ జగన్ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో వీడియోను కోట్లమంది ప్రజలు చూశారన్న వైఎస్ జగన్.. ఎవరిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పులు చేస్తే.. చర్యలు తీసుకోవాలని కోరిన వారిపై తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్ సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక ప్రజలను సంక్షోభంలోకి నెట్టారని.. ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు తప్పులను ప్రజలు తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారని.. తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్ జగన్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these