వల్లభనేని వంశీకి 14 రోజల రిమాండ్, జైలుకు తరలింపు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వల్లభనేని వంశీకి 14 రోజల రిమాండ్, జైలుకు తరలింపు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. వంశీకి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశా­రనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్‌­ఎస్‌ క్లాజ్‌ 140 (1), 308, 351 (3) ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వంశీతో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్‌ విధించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు ఆయన్ను ప్రశ్నించిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు వాదనలు జరిగాయి.. ఆ తర్వాత జడ్జి ముగ్గురికీ 14 రోజుల చొప్పున రిమాండ్‌ విధించారు.

వంశీ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ కీలకంగా వ్యవహరించారన్నారు. సత్యవర్దన్‌ను వంశీ అనుచరులు బెదిరించినట్లు గుర్తించారు.. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడన్నారు. విశాఖపట్నం పోలీసులు సమాచారంతో సత్యవర్ధన్‌ను విజయవాడ తీసుకొచ్చామన్నారు. సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో.. ఈ కేసులో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారన్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ సత్యవర్ధన్‌ అన్న కిరణ్, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు రమాదేవి ఫిర్యాదులతో వల్లభనేని వంశీపై పటమట స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ‘నా సోదరుడు సత్యవర్ధన్‌ టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.. 2023 ఫిబ్రవరి 20న వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి చేసిన సమయంలో.. నా తమ్ముడ్ని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కులం పేరుతో దూషించారు. పార్టీ కార్యాలయాన్ని, అక్కడున్న వాహనాలను తగలబెట్టిన ఘటనపై సత్యవర్ధన్‌ గన్నవరం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీ, ఆయన అనుచరులు.. రాజీపడాలని నా తమ్ముడిపై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే చంపేస్తామని బెదిరించారు’అని కిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘నన్ను, నా తల్లిదండ్రులను కూడా భయపెట్టారు. దీంతో భయపడి మా తమ్ముణ్ని హైదరాబాద్‌ పంపించాం. ఈ నెల 7న పని నిమిత్తం తిరిగి ఇంటికి వచ్చాడు. 10న సత్యవర్ధన్‌కు పలువురు ఫోన్లు చేశారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మా తమ్ముడు తిరిగి రాలేదు. వంశీ అనుచరులు కోర్టుకు తీసుకెళ్లి తప్పుడు వాంగ్మూలం చెప్పించారు’అని కిరణ్ విజయవాడ పటమట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. కిరణ్ ఫిర్యాదుతో పటమట పోలీసులు ‘బీఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 140 (1), 308, 351 (3), రెడ్‌విత్‌ 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టంలోని సెక్షన్‌ 3(2) (విఏ), సెక్షన్‌ 3(1), (ఆర్‌)’ కింద కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులు కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు, వెంకట శివరామకృష్ణ ప్రసాద్‌, నిమ్మ లక్ష్మీపతి మరికొందరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వంంశీని, వెంకట శివరామకృష్ణ ప్రసాద్‌, నిమ్మ లక్ష్మీపతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్‌ను వంశీ, ఆయన అనుచరులు భయపెట్టి, డబ్బులు ముట్టజెప్పి వారికి అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించారని టీడీపీ మహిళా నేత రమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డబ్బులు ఏ రూపంలో ముట్టజెప్పారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these