ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగవేసేందుకు సాకులు చెబుతున్నాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తనకు తాను ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు కదా? మరి ఆయనకు ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థికపరిస్థితి తెలియదా? అని ప్రశ్నించారు. అన్నీ తెలిసి ప్రజలకు అలివి కానీ హామీలు ఎందుకు ఇచ్చారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలదీశారు. తాను హామీలు అమలు చేయకపోవడానికి, జగన్ కు సంబంధం ఏంటన్నారు.
సంక్షేమ కార్యక్రమాలను…
కేవలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ఇష్టం లేకనే ఏదో ఒక కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. అన్నీ తెలిసిన పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో మౌనంగా ఉంటూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్షేపించారు. తనపై ఇసుక దోపిడీ చేశారంటూ ఆరోపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు జరుగుతున్న దోపిడీని ఎందుకు ప్రశ్నించరని ఆయన అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటానని ఆయన తెలిపారు. పార్టీని వీడినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.