ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై స్పీకర్ ఇవాళ ఫైర్ అయ్యారు. ఇలా డిమాండ్లు చేస్తున్న వారిపై మండిపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్న నేత కావడంతో అయన్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అడగటానికి రాజకీయ నాయకులు ఎవరంటూ టీడీపీ నేతలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తామెలా అడుగుతామన్నారు. ఆ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలన్నారు. విశాఖలో జరుగుతున్న పర్యాటశాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న అయన్నపాత్రుడు ఈ మేరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లపై అనూహ్యంగా స్పందించారు. దీంతో అయన్న వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు దారి తీశాయి.
వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ నేతలు మొదలుపెట్టిన లోకేష్ కు డిప్యూటీ సీఎం చర్చ ఆ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్లింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం.. నేతల్ని ఈ విషయంలో నోరు మెదపవద్దని ఆదేశించింది. కూటమిలో చర్చించాకే ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని చెప్పేసింది. అలాగే కూటమి మిత్రపక్షం జనసేన సైతం తమ పార్టీ నేతల్ని కూడా ఈ అంశంపై స్పందించవద్దని కోరింది. దీంతో అంతా సైలెంట్ అయ్యారని భావిస్తున్న సమయంలో అయన్న ఈ కామెంట్స్ చేశారు.