ఈవై ఇండియా సిఇఓ, రాజీవ్ మెమానితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఐటి పూల్ కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఎఐ, డీప్ టెక్ పరిశోధనలపై దృష్టిసారించామన్నారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఐటి నిపుణులు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతిలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఐటిరంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో బ్యాకెండ్ ఐటి కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే అక్కడఉన్న బలమైన మౌలిక సదుపాయాల ప్రయోజనాన్ని మీరు పొందే అవకాశముందని పేర్కొన్నారు. వివిధ రకాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న ఎపిలో స్థానిక విశ్వవిద్యాలయాలు, సంస్థల భాగస్వామ్యంతో ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో నైపుణ్యాభివృద్ధికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయమని ఆహ్వానించారు.
బలమైన వర్క్ ఫోర్సును…
తద్వారా భవిష్యత్తుకు అవసరమైన బలమైన వర్క్ ఫోర్సును తయారుచేసే అవకాశముందని తెలిపారు. ఈవై ఇండియా సిఇఓ రాజీవ్ మెమాని మాట్లాడుతూ… తమ సంస్థ భారతదేశంలోని ముంబై, న్యూడిల్లీ, బెంగుళూరు వంటి ప్రధాన నగరాలతో సహా పలు ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలకు అవసరమైన వృత్తిపరమైన సేవలను అందిస్తోందన్నారు. దేశంలో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ట్రెండ్ లను హైలైట్ చేస్తూ ఈవై-ఐవిసీఎ నివేదిక వంటి పరిశ్రమ నివేదికలను వెలువరిస్తోందని చెప్పారు. ఇటీవలే తమ సంస్థ ఎఐ రంగంలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈవై.ఎఐ ప్లాట్ ఫాంను ప్రారంభించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాజీవ్ మెమాని హామీ ఇచ్చారు.