కేసీఆర్ గొప్పనాయకుడు, ఆయనో భోళా శంకరుడు.. కేటీఆర్‌కు సారీ చెప్పా.. దానం నాగేందర్ యూటర్న్!?

Khairatabad Mla Danam Nagender Comments On Kcr And Ktr And Revanth Reddy In Interview

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ గొప్ప నాయకుడని.. ఆయన ఓ భోళా శంకరుడంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌, కేటీఆర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. మొన్నటివరకు ఇష్టమున్నట్టు విమర్శలు చేసి.. అసెంబ్లీ సాక్షిగా బూతులతో విరుచుకుపడిన దానం నాగేందర్ ఒక్కసారిగా వారిపై ప్రశంసలు కురిపించటంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ గొప్పనాయకుడని.. పైకి ఆగ్రహంగా మాట్లాడినా.. ఆయనది సున్నితమైన మనసని.. గులాబీ బాస్‌ను దానం నాగేందర్ ఆకాశానికెత్తేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. ఓడిపోయారు. కాగా.. అప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన దానం నాగేందర్ ఇప్పుడు ఇలా యూటర్న్ కామెంట్స్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఇంటర్వ్యూలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ముగ్గురి పాలన గురించి మీరేం చెప్తారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడని.. ఆయన చేసిన కార్యక్రమాలతో జీవితాంతం జనాల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పుకొచ్చారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఆయన కోసం వచ్చిన ప్రజలను కలిసేవారని.. వాళ్లు తీసుకొచ్చిన అర్జీలు తీసుకుని.. అందులో కొన్నింటికి వెంటనే పరిష్కారాలు చెప్పేవారని.. మరికొట్టిని అధికారులకు చెప్పి చేపించేవారని.. మధ్యాహ్నం సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడేవారని వివరించారు.

అదే సమయంలో కేసీఆర్ కూడా తన దృష్టిలో గొప్పనాయకుడని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన చుట్టూ ఉన్న కొంత మంది వల్ల చెడ్డ పేరు వచ్చిందని.. పైకి ఆగ్రహంగా కనిపించినా కేసీఆర్ సున్నిత మనస్కుడని.. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ భోళా శంకరునిలాంటి వారని దానం చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ చుట్టూ ఉన్నావాళ్లు ఆయనను ఎవరినీ కలవనివ్వకుండా చేసి ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇక.. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై కూడా స్పందించిన దానం నాగేందర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఫార్ములా వన్ తీసుకొచ్చేందుకు ఆనాడే సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రయత్నించారని కానీ.. అది సాధ్యపడలేదన్నారు. కానీ.. బీర్ఎస్ హాయంలో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కోసం కష్టపడి తీసుకొచ్చారని తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనటంలో ఎలాంటి అనుమానం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇందులో కేటీఆర్ అవినీతి చేశారా అన్న అంశంపై ప్రస్తుతం ఈడీ, ఏసీబీ దర్యాప్తు చేస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఏం కామెంట్ చేయకపోవటమే మంచిదన్నారు.

అంతేకాకుండా.. అసెంబ్లీలో తాను వాడిన అసభ్యకరమైన పదజాలంపై కూడా స్పందించారు. అది ఆవేశంలో చేసినవని.. దానిపై తాను వ్యక్తిగంతంగా కూడా విచారం వ్యక్తం చేశానని.. కేటీఆర్‌కు కూడా పర్సనల్‌గా సారీ చెప్పానని తెలిపారు. మరోవైపు.. తాను ఫైటర్‌నని ఉపఎన్నికకు భయపడనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే హైడ్రా, మూసీ పునరుద్ధరణ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసుకోవాలని.. మూసీ పునరుద్ధరణ చేస్తే నగరానికి బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరుగుతుందని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these