ఇంట్రెస్టింగ్ సీన్.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే!

Andhra Pradesh Cm Chandrababu Telangana Cm Revanth Reddy Meet In Davos

రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్‌ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు ఉన్నారు. దావోస్‌ సదస్సుకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతరులు ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కాసేపు ముచ్చటించుకున్నారు. నేడు జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు దావోస్‌ వెళ్లారు. జ్యూరిచ్‌ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సమావేశం కానున్నారు. అయితే అంతకముందు జ్యూరిచ్‌ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.

చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌ ’ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి దావోస్‌‌కు వెళ్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో, ఆర్సెలర్స్‌మిట్టల్‌ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్‌తో డిన్నర్‌ మీట్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండోరోజు దావోస్‌ లో గ్రీన్‌ హైడ్రోజన్‌పై జరిగే ప్రత్యేక సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే కోకాకోలా, ఎల్‌జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశంకానున్నారు. రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో కూడిన టీమ్‌లు దావోస్ చేరుకున్నాయి. భారీగా పెట్టుబడులు వస్తాయని ధీమాతో ఉన్నారు.

యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్‌తో భేటీ.. ఎనర్జీ ట్రాన్సిషన్‌, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్లలో చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం ఉంటుంది. దావోస్ టూర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వూలు ఇవ్వనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో భాగంగా మూడోరోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశం అవుతారు. చంద్రబాబు అండ్ టీమ్ నాలుగో రోజు జ్యూరిచ్‌ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these