గుంటూరు జిల్లా: మంచి దిగుబడి వచ్చే పత్తి విత్తనాలు, పెరిగిపోతున్న చీడ, పీడలపై కూడా పరిశోధన చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. కాకుమానులో ప్రసాద్ సీడ్స్ నిర్మిస్తున్న అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సెంటర్‌కు ఇవాళ(ఆదివారం) కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంఖుస్థాపన చేశారు. కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతులు, కమ్యూనిటీ హాల్‌ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ… వ్యవసాయానికి కూలీలు దొరకని పరిస్థితి ఇప్పుడు ఉందని అన్నారు. లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని చెప్పారు. డ్రోన్ శిక్షణ సెంటర్‌ను పెట్టి వెయ్యి మందిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మున్ముందు రోజుల్లో అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేస్తున్నారని అన్నారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
