ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో అభివృద్ధి వేగంతో పరుగులు తీస్తుందంటారు. అలాగే పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది. అన్ని రకాలుగా రాయితీలు ఏపీలో నెలకొల్పితే లభిస్తాయి. చంద్రబాబు వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం, విశ్వాసం ఇటు పారిశ్రామికవేత్తల్లోనూ, అటు ఇన్వెస్టర్లలోనూ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి అనేక సంస్థలను తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుదే. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత మాత్రం అంతగా పారిశ్రామికంగా సాధించలేకపోతున్నారు.
చంద్రబాబు, జగన్ అయినా..? 2014లో చంద్రబాబు మొదటిసారి ఏపీలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అనేక పరిశ్రమలు వస్తాయని భావించారు. కియా పరిశ్రమను అయితే అనంతపురానికి తేగలిగారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్నందున అనంతపురంలో కియా పరిశ్రమ క్లిక్ అయింది. కియా కార్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు కియా పరిశ్రమలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే విశాఖలో ఆ తర్వాత పార్ట్ నర్ షిప్ సమ్మిట్ పెట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. అయితే పరిశ్రమలు మాత్రం గ్రౌండ్ కాలేదు. అనుకున్నంతగా పారిశ్రామికాభివృద్ధి జరగలేదు.
బెజవాడలో ఉష్ణోగ్రతలు…
ఇక జగన్ హయాంలోనూ అంతే. సంక్షేమ పథకాలపై ఆయన ఫోకస్ పెట్టారు. జగన్ ప్రభుత్వం కూడా విశాఖలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరిగింది. అప్పుడూ అంతే. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటనలు మాత్రం ఆర్భాటంగా చేశారు. 2019 నుంచి 2024 వరకూ పెద్దగా పరిశ్రమలు కూడా రాలేదు. విశాఖను రాజధానిని చేస్తామని ప్రకటించారు. అయినా సరే పరిశ్రమల స్థాపనలకు ఎవరూ ముందుకు రాలేదు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం మాత్రమే నగరాలుగా ఉన్నాయి. విజయవాడ వాతావరణ పరిస్థితులకు ఎవరూ ఉండలేని పరిస్థితి. ఎండ వేడమి ఎక్కువ. ఉద్యోగులు ఎక్కువగా విజయవాడ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే అక్కడ నివాసం ఉండటానికి, ఉద్యోగం చేయడానికి ఇతర ప్రాంత వాసులు ఇష్టపడరు. బెజవాడను పెద్ద పల్లెటూరు అంటారు. పేరుకు నగరమే కాని, పల్లెటూరు వాతావరణం ఎక్కువగా ఉంటుంది.
విశాఖ నగరం అయితే?
ఇక విశాఖ నగరం వాతావరణం పరంగా బాగానే ఉంటుంది. కాస్మోపాలిటన్ నగరం. అయితే అక్కడ ఉక్కపోత వాతావరణానికి ఇమడలేక చాలా మంది ఇష్టపడరు. సముద్రానికి పక్కనే ఉండటంతో ఎప్పుడూ తుఫాన్లు, వర్షాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాయకత్వాలు సమర్థవంతమైనా ప్రదేశాలు అనుకూలంగా లేకపోవడం వల్లనే పరిశ్రమలు ఎక్కువగా రాలేకపోతున్నాయని, నేతలు కూడా ఎంత ప్రయత్నించినా, ఎన్ని రాయితీలు ఇచ్చినా తీసుకురాలేకపోతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎక్కువగా పూనే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాన్నే కోరుకుంటున్నారు తప్పించి విజయవాడ, విశాఖలకు రావడానికి అంగీకరించకపోవడం వల్లనే పరిశ్రమల స్థాపన వేగంగా జరగడం లేదన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. మారి రానున్నకాలంలో ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశముందేమో చూడాలి.