Andhra Pradesh : రోడ్డు ట్యాక్స్ ఏంది బాబూ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతా హైఫైగా ఆలోచిస్తుంటారు. అయితే ఆయన ఆలోచన విన్నూత్నమంటూ అనుకూల మీడియా తెగపొగిడేసింది. ఇదేమీ కొత్త ఆలోచన కాదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ఫీజులను గ్రామీణ ప్రాంతాల్లో తెస్తానని చంద్రబాబు చెప్పడం ఎంత మేరకు విన్నూత్న ఆలోచన అనేది వారే చెప్పాలి. అసలు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు వేయాల్సిన బాధ్యతఎవరిది? ప్రభుత్వానిది కాదా? ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేసే పన్నులతో రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంది.

వైసీపీ విఫలమయినా…

గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించింది నిజమే కావచ్చు. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి దాదాపు 850 కోట్లను కేటాయించామని చెప్పడం ఒకరకంగా మంచిదే. అయితే చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రతిపాదనపైనే నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ జరగుతుంది. పబ్లిక్, ప్రయివేటు, ట్రాన్స్ ఫర్ పద్ధతిలో గ్రామీణ ప్రాంతంలో రహదారులను నిర్మిస్తామని చెప్పడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు రోడ్డు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామని చెబుతున్నప్పటికీ కార్ల దగ్గర నుంచి అనేక భారీ వాహనాలకు రోడ్డు ట్యాక్స్ రూపంలో టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అదే జరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత రాక మానదు.

జాతీయ రహదారులపై…

ఇప్పటికే జాతీయ రహదారులపై ముక్కుపిండి మరీ టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ పెట్టి మరీ మనకు తెలియకుండానే మన అకౌంట్లలో నుంచి డబ్బులు వెళ్లిపోతున్నాయి. జాతీయ రహదారులపై ప్రతి ఎనభై కిలో మీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టారు. అయితే ఎప్పుడో ఒకసారి ఏడాదికి ఒకటి రెండు సార్లు ప్రయాణం చేస్తాం కాబట్టి జాతీయ రహదారులపై టోల్ ఫీజులను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. లైట్ గా తీసుకుంటారు. కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిత్యం తిరుగుతూనే ఉంటారు. రాష్ట్రంలో ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణించేందుకు ఎక్కువగా రాష్ట్ర రహదారులనే వినియోగిస్తుంటారు. తరచూ ప్రయాణించే రోడ్లపై టోల్ ఫీజు పెడితే ప్రజలు ఊరుకుంటారా? అన్నది ఇక్కడ ప్రశ్న.

గోదారోళ్లే తొలి విడతగా…

ముందుగా ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు ప్రకటించారు. అందుకు ప్రజలను ఒప్పించాలని ఎమ్మెల్యేలపై భారం మోపారు. కానీ ప్రజలు టోల్ ఫీజు చెల్లించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? ఇప్పటికే అనేక రకాలుగా ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరలా ఈ టోల్ ఫీజు ఏంటని కొందరు సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు నింపుకుని ఏపీలోకి భారీ వాహనాలు అడుగుపెడుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు టోల్ బాదుడు కూడా మొదలయితే ఇక జనం నుంచి ఎందుకు అంగీకారం లభిస్తుందని ఎమ్మెల్యేలే కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు విన్నూత్న ఆలోచన ఆచరణలో అమలయితే అది కూటమికే రివర్స్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these