హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన ఈ రెండు మహా నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సౌలభ్యంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో అడుగు పడింది.
ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీన్ని అమలు చేయబోతోంది.హైదరాబాద్-విజయవాడ మధ్య జాతీయ రహదారిని ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేగా విస్తరించేందుకు వీలుగా జాతీయ రహదారి ప్రాధికార సంస్ధ (NHAI) చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఈ పని కోసం టెండర్లు దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ అర్ధాంతరంగా వైదొలగడంతో దాని స్ధానంలో మరో కాంట్రాక్టర్ ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఈ మేరకు రూ.700 కోట్ల బడ్జెట్ తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లు పిలవబోతున్నారు.తెలంగాణ రాష్ట్రం పరిధిలో 181 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని గతంలో నాలుగు లైన్లుగా విస్తరించారు. కానీ ఆరు లైన్ల విస్తరణ సాధ్యం కాలేదు. కానీ అప్పటికే భూసేకరణ జరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా భూసేకరణ అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఈ రహదారి విస్తరణ పనులకు డీపీఆర్ తయారీకి ఓ ప్రైవేటు సంస్ధకు పనులు అప్పగించబోతున్నారు.
అనంతరం రూ.700 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తారు. వెంటనే పనులు కూడా ప్రారంభం కానున్నాయి.హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పూర్తయితే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ వేగం పెరగడంతో పాటు సమయం కూడా భారీగా ఆదా కానుంది.