ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కృతికి తెర తీశారు ఆ ఎమ్మెల్యే. తనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థి ఇంటికి వెళ్లి మరీ పలకరించారు ఆ ఎమ్మెల్యే. ఏపీ రాజకీయాల్లో టిడిపి, వైసిపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయి.
ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులకు పైఎత్తులు వేసుకొని.. కారాలు, మిరియాలు నూరుకున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం.. ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తాం అంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లారు టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటించారు.
అనంతరం మడకశిర తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో పళారం గ్రామంలో మడకశిర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందా? అంటే అది మడకశిర నియోజకవర్గమే.. ఎందుకంటే చివరి రౌండ్ వరకు గెలుపు ఎంఎస్ రాజు.. ఈరా లక్కప్పల మధ్య దోబూచులాడింది. ఆఖరి రౌండ్ లో కేవలం 351 ఓట్ల తేడాతో ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తనపై ఓడిపోయిన ప్రత్యర్థి కదా అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గర్వానికి పోలేదు..
తనను ఓడించిన వ్యక్తి తన దగ్గరకు వచ్చాడని భేషజాలకు పోకుండా ఈరా లక్కప్ప కూడా ఎమ్మెల్యేను ఇంట్లోకి సాదరంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. ఈరా లక్కప్ప కాసేపు మాట్లాడుకున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని.. ఎన్నికలు అయిన తర్వాత ప్రజల కోసం అంతా కలిసి పనిచేయాలన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. తనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థిని మాటలతో గుచ్చి గుచ్చి విమర్శించకుండా.. మర్యాదపూర్వకంగా కలిసి కొత్త రాజకీయ సాంప్రదాయానికి తెర తీశారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.