తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో బదిలీలకు పూనుకున్నారు. ఇదివరకు పెద్ద ఎత్తున ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనాన్ని కల్పించారు. దాన్ని కొనసాగిస్తోన్నారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న రవి గుప్తాకు స్థానచలనం కలిగింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు జీఓ జారీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొద్దిసేపటి కిందటే ఈ జీఓను విడుదల చేశారు. రవి గుప్తా.. హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచీ రవి గుప్తా.. డీజీపీగా వ్యవహరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ స్థానంలో ఉన్న అంజనీకుమార్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే రేవంత్ రెడ్డిని కలవడం.. ఆయన బదిలీకి కారణమైంది.
అంజనీకుమార్ స్థానంలో రవి గుప్తా డీజీపీగా నియమితులయ్యారు. ఆ తరువాత కూడా కొనసాగారు. తాజాగా చోటు చేసుకుంటోన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రవి గుప్తాను బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఆయన స్థానంలో జితేందర్‌ను కొత్త డీజీపీగా నియమించింది.
1992 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.. జితేందర్. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. ప్రస్తుతం ఆయన డీజీ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. గతంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్‌గా, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పని చేశారు.