ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి అందుతున్నాయి. తమ అనుభవాలను తెలియచేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. ఆదివారం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు శ్రీ విజయ రామ్ కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను చూపించారు. • పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా…ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుంది. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాము. అదే విధంగా దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభం. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాము” అన్నారు.
