ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రగతి భవన్ నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ ఉదయం ఆమె భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. మర్యాదపూరకంగా ఆయనను కలిశారు.
ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ కార్యక్రమాన్ని ఏపీసీసీ ఘనంగా నిర్వహించబోతోంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో గల పార్టీ కార్యాలయాల్లో వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
విజయవాడలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సంస్మరణ సభను కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లి కాంగ్రెస్ ఓటుబ్యాంకును మళ్లీ ఆకర్షించడంలో భాగంగా వైఎస్ షర్మిల ఈ జయంతి కార్యక్రమాలను ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
2029 ఎన్నికల నాటికి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా కాంగ్రెస్ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపాలు కావడం, 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో- దానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది షర్మిల పట్టుదలగా చెబుతున్నారు.ఇందులో భాగంగా నిర్వహించ తలపెట్టిన వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ భట్టి విక్రమార్కను ఆహ్వానించారు షర్మిల. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ తరఫున ఆయన హాజరు కావడమా? లేక ప్రతినిధులను పంపించడమా? అనేది త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉంది.