చంద్రబాబు కేబినెట్ లోకి వంగవీటి రాధా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు.మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2014 ఎన్నికలలో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేసింది. అప్పట్లో జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి జనసేన విడిగా పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు కూడా లేదు. జగన్ రెడ్డి ఒక్క చాన్స్ విజ్ణప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగా చీలిక వచ్చింది. దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే కాపు సామాజి వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజికవర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వంగా హత్యకు ముందు నుంచీ ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూటమి పక్షాన నిలిచేలా చేయడంలో వంగవీటి రాథా ఎంతో కృషి చేశారని తెలుగుధేశం అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే తెలుగుదేశం కూటమి సర్కార్ లో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రబాబు తన కేబినెట్ లో 24 మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు. ఆ స్థానాన్ని వంగవీటి రాథాతో భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు.ఇప్పుడు ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూలు విడుదల చేసింది. ఆ స్థానాలలో ఒక దాని నుంచి వంగవీటి రాధాను నిలబెట్టి గెలిపించుకుని కేబినెట్ లో స్థానం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటికే కాపుసామాజిక వర్గానికి చెందిన నలుగురికి చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే వంగవీటి రాధా విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా, కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్ లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these