ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ సిద్దం పేరుతో భీమిలి వేదికగా భారీ సభతో ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జగన్ తన పార్టీ అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తి చేసారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే చంద్రబాబును కుప్పంలో ఓడించటమే వైసీపీ లక్ష్యంగా చెబుతోంది. చంద్రబాబు కుప్పం తో సహా మరో నియోజకవర్గంలో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ఏకమయ్యారు. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. షర్మిల ప్రతీ సందర్భంలోనూ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇటు జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయం సాధించిన తరువాత అక్కడ మరింత ఫోకస్ పెంచింది.
దీంతో, చంద్రబాబు ప్రతీ మూడు నెలలకు ఒక సారి మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్నారు. దీంతో, కుప్పంలో భరత్ ను అభ్యర్దిగా ప్రకటించిన సీఎం జగన్..ఎమ్మెల్సీగా చేసారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. దీంతో..చంద్రబాబు సైతం వై నాట్ పులివెందుల నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కుప్పంతో పాటు మరోచోట చంద్రబాబు పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వచ్చేది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనేది చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. జగన్ ఇచ్చిన హమీ, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ 99 శాతం అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. దీంతో, ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరోసారి చంద్రబాబు రెండో స్థానం నుంచి పోటీ పైన చర్చ మొదలైంది.