తాజాగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పుల్లో భాగంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్ యాదవ్‌ను జగన్ నియమించారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర సుస్పష్టం. జెడ్పీటీసీగా, జడ్పీ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా వైఎస్ హయాంలోనే కారుమూరి రాజకీయంగా ఎదిగారు. కమ్మ సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బీసీ నేత కారుమూరిని బరిలోకి దింపి గెలిపించారు వైఎస్. ఇప్పుడు కారుమూరి కుమారుడు సునీల్ యాదవ్‌ను ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా జగన్ నియమించడం వెనుక కూడా ఇలాంటి వ్యూహమే కనిపిస్తోంది.
2009లో వైఎస్ మ్యాజిక్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి టీడీపీ కమ్మ సామాజికవర్గం అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున కాపు అభ్యర్థి రంగంలో ఉన్నారు. దీంతో వైఎస్ సామాజిక సమీకరణాలు లెక్కేసి బీసీ అభ్యర్థి కారుమూరిని పోటీకి దింపారు. ఆయన లెక్కలు కరెక్టయ్యాయి. బలమైన సామాజికవర్గం అభ్యర్థులను పక్కకు నెట్టి కారుమూరి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లోనూ తణుకులో మరోసారి గెలిచి, మంత్రి కూడా అయ్యారు.