సంక్రాంతంటే, భగభగ మండే భోగిమంటలే కాదు… కోనసీమ లో కొన్ని వందల సంవత్సరాలనుండీ, నిరాటంకంగా జరుగుతూన్న ‘ ప్రభల తీర్థం ‘ కూడా గుర్తుకు రావడం ఖాయం కదూ…కోనసీమ నలుమూలలనుంచేకాకుండా, దేశవిదేశాల్లోని కోనసీమ వాసులంతా ఈ ‘ప్రభల తీర్థం’ గురించి ఎదురు చూస్తారనడం లో ఆశ్చర్యం లేదు. ఈ తీర్థం కోనసీమ వాసుల సంస్కృతి, సాంప్రదాయాలను ఇనుమడింపచేస్తుంది. ముఖ్యంగా, అంబాజీపేట మండలం లో ఉన్న ‘ జగ్గన్నతోట’ లో జరిగే , ఏకాదశరుద్రుల సమాగమనం..
ప్రభల ఊరేగింపే ఒక ఆశ్చర్యం.. చుట్టుపక్కల గ్రామాలు.. ముక్కామల, గంగలకుర్రు , వ్యాఘ్రేశ్వరం గ్రామాలనుండి, బయలుదేరి, పంటచేలు, కొబ్బరితోటలూ దాటుకుంటూ, మధ్యలో , ఆమధ్య ఎప్పుడో, కౌశిక మీద వంతెన వేసినా, ఇప్పటికీ అనాదిగా వస్తూన్న సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, మొలనోతు నీళ్ళలో కూడా, ఆ ‘ప్రభలని’ మోసుకురావడం, ఎక్కడా కిందపెట్టకుండా, చూస్తేనే వళ్ళు గగుర్పొడుస్తుంది.. ఆ భక్తి శ్రధ్ధలు అలాటివి మరి.. గూడు బండ్లూ, ఎడ్ల బండ్లూ , కొబ్బరి ఆకులతో ఏర్పాటు చేసుకుని , కుటుంబ సభ్యులందరూ రావడం మరో ప్రత్యేకత.అన్ని గ్రామాల ప్రజలు అంగరంగ వైభవంగా కనుమ పండుగ రోజు ప్రభల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఏకాదశ రుద్రుల కొలువు అని కూడా పిలిచే ఈ వేడుకలకు అంబాజీపేట మండలం మొసలపల్లి పరిధిలోని జగ్గన్నతోట వేదిక అవుతుంది. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు ఎటు వంటి గుడి, గోపురం ఉండదు. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవం జరుగుతుంది. ప్రాచీన కాలంలోనే తొలిసారిగా జగ్గన్నతోటలోనే ప్రభల తీర్థం నిర్వహించారని భోగేశ్వరస్వామి ఆలయంలోని రాగి శాసనాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు కొలువతీరేది దేశం మొత్తం మీద జగ్గన్నతోట ఒక్కటే. 17వ శతాబ్దంలో సంక్రాంతిలో కనుమ నాడు ఏకాదశ రుద్రలు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై చర్చించారని చారిత్రక కఽథనం.
పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైనా రాజా వత్సవాయి జగ్గనాథమహారాజు(జగ్గన్న) ప్రభల తీర్థం విచ్చేసి ఏకాదశ రుద్రులను దర్శించుకుని తీర్థాన్ని ఘనంగా నిర్వహించారని, దీంతో ఈ ప్రాంతాన్ని జగ్గన్నతోటగా పిలుస్తున్నారని చెబుతుంటారు. ప్రభల తీర్థాన్నే కాదు, ప్రభల తయారీనికూడా, ఓ యజ్ఞంలా నిర్వహిస్తారు భక్తులు. తాటిపట్టిని శూలంగా ఉంచి,దానికింద బలమైన బళ్ళను ఉంచి, చుట్టూ ‘యూ ‘ ఆకారం లో , గెడబద్దలను ఉంచుతారు. వివిధ రకాల వస్త్రాలతో ముస్తాబు చేస్తారు.
సంక్రాంతి ప్రభల తీర్థాలకు ముఖ్య వేదిక కోనసీమ. దాదాపు 120 గ్రామాలలో సంక్రాంతి సమయంలో ప్రభల తీర్థాలు జరుగుతాయి. దేశ, విదేశాలలో స్థిరపడిన ఎంతో మంది ప్రభల తీర్థానికి వస్తుండడం విశేషం. ఈశ్వరుని ప్రతిరూపంగా పిలిచే ప్రభలు గ్రామాలలో ఊరేగిస్తే శాంతి సౌభాగ్యాలు చేకూరతాయనేది పూర్వీకుల నమ్మకం. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత పురోభివృద్ధి సాధించినా అధునాతనమైన వాహనాలు అందుబాటులోకి వచ్చినా సంప్రదాయబద్ధంగా బండెనక బండి కట్టి రెండెడ్ల బళ్ళపైనే ప్రజలు ప్రభల తీర్థాలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. కోనసీమలోని పచ్చని కొబ్బరి చెట్ల నడుమ దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ ఈ ప్రభల ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతాయి. దీంతో పచ్చని కొబ్బరి ఆకులతో అల్లిన తడికలతో రెండెడ్ల బళ్ళకు గూడును కట్టి వాటిలో ప్రయాణిస్తూ ప్రభల తీర్థాలకు రావడం ఈ ప్రాంత మహిళలకు మహా సరదా.. దీని కోసం ఎంతో ఆత్రుతగా సంక్రాంతి ప్రభల తీర్థం కోసం వేచి చూస్తారు.
గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర్ కౌశికను దాటుకొంటూ వచ్చే సుందర దృశ్యాలను చూసేందుకు వేలాది మంది పోటి పడతారు. అప్పటికే నారుమడులు వేసిన రైతులు చేలలో వరిపంట పచ్చదనం నిండుగా కనిపిస్తుంది. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రుకు చెందిన యువకులు ఆయా గ్రామాల ప్రభలను భుజాలపై మోసుకొంటూ శరభ, శరభ అంటూ ప్రభలను పంట చేలను తొక్కుకొంటూ తీసుకు వస్తారు. అనంతరం జగ్గన్నతోటకు చెంతనే ఉన్న అప్పర్ కౌశిక నదిని ఈ రెండు ప్రభలను దాటించే తీరు ఉత్క ంఠకు గురి చేస్తుంది. అలాగే వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రే శ్వర స్వామి, కె.పెదపూడి నుంచి మేనేకశ్వరస్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వ రస్వామి, నేదు నూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘే శ్వరస్వామి, మొసలపల్లి మధుమానంద భోగేశ్వరస్వామి, పాల గుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభలపై ఉత్సవమూర్తులను ఉంచి మేళతాళలతో ప్రభల తీర్థానికి తీసుకువస్తారు. ఈ ప్రభలకు అథిత్యమిచ్చే మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి వారు ప్రభ అన్ని ప్రభల కంటే ముందుగా జగ్గన్నతోటకు చేరుకొని ప్రభలకు ఆహ్వానం పలుకుతుంది..
జీవితం లో ఒక్కసారైనా చూసి ఆనందించవలసిన వాటిలో, కోనసీమ లోని జగ్గన్నతోట ప్రభల తీర్థం ఒకటీ….