లోక కల్యాణార్థం నగరంలోని మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మోనా దంపతులు నిర్వహిస్తున్న యాగ మహోత్సవం శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. లక్ష్మీ గణపతి పూర్వక నవ చండీ రుద్ర సహిత నవగ్రహ సుబ్రహ్మణ్య మన్యు పాశుపత యాగ మహోత్సవం పండితులు వేద మంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. మూడవ రోజు శుక్రవారం శక్తి పంచాయతన మండపారాధన సహిత సుబ్రహ్మణ్య కార్త వీర్యార్జున సుదర్శన వాస్తు సహిత మహాలక్ష్మి మహకాళి మహా సరస్వతి స్వరూపిణి మహా నవ చండీ మన్యు పాశు పత హోమాలు రుత్విక్కులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రధానంగా కార్త వీర్యార్జుని అర్చన అత్యంత విశేషమైనది. మానవునిలో ధైర్యాన్ని, పట్టుదలను, విశ్వాసాన్ని సమృద్ధిగా కార్త వీర్యార్జుని స్త్రోత్రంతో సాధించవచ్చునని పండితులు తెలిపారు. ‘ఓం కార్త వీర్యార్జునొ నామ రాజా బాహు సహస్రవాన్..తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే’..ఈ ఒక్క స్త్రోత్రంతో..కార్త వీర్యార్జునుడు మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటాడని యాగం నిర్వహిస్తున్న వేద పండితులు తెలిపారు. కార్త వీర్యార్జునుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ అని వివరించారు. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు మానవ జన్మ ధరించిన కార్త వీర్యార్జునుడు పుట్టుకతో చేతులు లేవని, దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు కలవాడిగా మారతాడని..అందుకే అతనిని సహస్ర బాహు అని కూడా పూజిస్తారని తెలిపారు. మహా బలశాలి కాబట్టే రావణుడు అంతటి వాడిని బంధించాడన్నారు. కేవలం శ్రీహరి చేతిలో మాత్రమే తనకు మరణం ఉండాలనే కోరిక మేరకు చివరకు పరశురాముని చేతిలో హతం అవుతాడని తెలిపారు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారమేనని చెప్పారు. కార్తవీర్యార్జునుని కోరిక మేరకు తిరిగి శ్రీహరి చేతిలో సుదర్శనమయ్యాడని పండితులు పురాణ కథనాన్ని భక్తులకు తెలిపారు. అంతటి బలవంతుడు, సాక్షాత్తూ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం యొక్క అంశ కాబట్టి..మానవుడు అనుకున్న కోరికలు నెరవేర్చుకునేందుకు అత్యంత సులభమైన కార్తవీర్యార్జునుడి స్త్రోత్ర పఠనంచే ఫలితాన్ని పొందవచ్చునన్నారు. ఇటువంటి అర్చనలు, యాగ హోమాది క్రతువులను నిర్వహిస్తున్న ఎంపీ మార్గాని భరత్ రామ్, ఆయన సతీమణి మోనా దంపతుల జన్మ ధన్యమైందని అన్నారు. పవిత్రమైన ఈ యాగ మహోత్సవాలను తిలకించి ధన్యులు కావాలని నగర వాసులకు పండితులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, మోనా దంపతులతో పాటు వారి కుమార్తెలు జయాని, శివాన్షి రామ్, ఎంపీ తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన, ఎంపీ సోదరుడు విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని యాగ మహోత్సవాన్ని తిలకించారు.
