రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు సినీ పరిశ్రమకు చెందినవారు స్వయంగా వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలవడమో లేక ఫోన్ ద్వారా విష్ చేయడమో చేస్తుంటారు. ముఖ్యంగా నూతన సినిమాటోగ్రఫీ మంత్రికి సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిర్మాత దిల్ రాజు తప్ప ఎవరూ విషెస్ చెప్పలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోమటిరెడ్డే రివీల్ చేశారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. రోడ్లు, భవనాలు తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే కోమటిరెడ్డికి టాలీవుడ్ నుంచి దిల్ రాజు తప్ప ఎవరూ విషెస్ చెప్పకపోవడంతో.. ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ “సినీ పరిశ్రమ నుంచి నిర్మాత దిల్ రాజు తప్ప ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని మా సెక్రటరీని ఆదేశించాను” అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే త్వరలోనే సినీ పరిశ్రమ నుంచి ఓ బృందం వెళ్ళి స్వయంగా మంత్రిని కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
