ఇండియా కూటమిలోకి మరో రెండు పార్టీలు చేరనున్నాయా? చంద్రబాబు అరెస్టుతో టిడిపి, ఎన్డీఏ తో కటీఫ్ చెప్పడం ద్వారా జనసేన ఇండియా కూటమిలోకి చేరుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. బిజెపికి వ్యతిరేకంగా.. ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమి బలంగా కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని నడిపిస్తున్న బిజెపి బలంగా ఉంది. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే.. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. తాజాగా టిడిపి, జనసేన చేరితే ఇండియా కూటమి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు దగ్గర కావాలనుకున్నా బిజెపి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం ఎన్డీఏలో చేరేందుకు మొగ్గు చూపడం లేదు. అటు చంద్రబాబును ఇండియా కూటమిలోకి తీసుకెళ్లాలని వామపక్షాలు భావిస్తున్నాయి. సిపిఐ నేత నారాయణ నేరుగా చంద్రబాబు కి ఈ విషయం చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో జరిగిన పరిణామాల క్రమంలో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇప్పుడు పవన్ టిడిపి తో పొత్తు ప్రకటన, అటు ఎన్డీఏ కి గుడ్ బై చెప్పడం వంటి కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయ్యింది.
ఏపీలో బిజెపి కంటే వామపక్షాలే శ్రేయస్కరమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా వెల్లడైన ఒక సర్వేలో టిడిపి, జనసేన కూటమితో వామపక్షాలు కలిస్తే అద్భుత విజయం దక్కుతుందని తేలింది. అదే బిజెపితో అయితే వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. దీంతో టిడిపి, జనసేన పునరాలోచనలో పడ్డాయి. వామపక్షాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వామపక్షాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమి వైపు టిడిపి, జనసేన వెళ్లాల్సి ఉంటుంది.
గత ఎన్నికల్లో జనసేన వామపక్షాలతో కలిసి పని చేసింది. పవన్ భావజాలానికి, వామపక్ష భావజాలానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ సైతం పలు సందర్భాల్లో వామపక్షాలతో కలిసి పని చేసింది. మంచి విజయాలను దక్కించుకుంది. అందుకే మూడు పార్టీల కలయిక చాలా సులువు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే చాలా సంవత్సరాల తర్వాత వామపక్షాలు ప్రధాన రాజకీయ పక్షాల స్నేహాన్ని అందుకోనున్నాయి. ఆ రెండు పార్టీలను జాతీయస్థాయిలో ఇండియా కూటమి వైపు తీసుకెళ్ళనున్నాయి.