ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం, ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు పంపడం చకచకా జరిగిపోయాయి.
అయితే ఈ ఎపిసోడ్ జరుగుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ లండన్ లో ఉన్నారు. ఇవాళ లండన్ నుంచి తిరిగి వచ్చిన సీఎం జగన్.. అనంతరం పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో తొలిసారి ఈ అంశంపై స్పందించారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు సీఎం జగన్ ఇవాళ వైసీపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు అరెస్టుపై జనంలో ఎలాంటి స్పందన వస్తోందో తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ పై ఎలా వ్యవహరించాలన్న దానిపైనా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. జనంలో ఉండడంతో పాటు చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ దుష్ప్రచారం తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. టీడీపీ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ జనానికి వాస్తవాలు వివరించాలన్నారు. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో జరిగిన భేటీలో ఈ మేరకు ఎలా వ్యవహరించాలన్న దానిపై పలు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పార్టీకి, పథకాలకు సంబంధించిన ప్రచారంతో పాటు బాబు అరెస్ట్ పై చేసే దుష్ప్రచారం ఖండించాలని సూచించారు.మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వ అవినీతిపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జగన్ రోజుకో సబ్జెక్టు తో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పని తీరు, గత ప్రభుత్వం చేసిన అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరపాలని మంత్రులకు, చీఫ్ విప్ , విప్ లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.