ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 లక్ష్యంగా ఇప్పటి నుంచే పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ సమయంలోనే లండన్ పర్యటన పూర్తి చేసుకొని సీఎం జగన్ ఈ రాత్రికి అమరావతి చేరుకుంటున్నారు. ఇక, ఆపరేషన్ 2024 లో భాగంగా తదుపరి అడుగుల పై ఉత్కంఠ కొనసాగుతోంది.మారుతున్న సమీకరణలు:ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల ప్రణాళికలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తన కుమార్తె వద్దకు లండన్ వెళ్లారు. ఈ నెల 2న లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి ఈ రాత్రికి తిరిగి అమరావతికి వస్తున్నారు. ఈ సమయంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశ పెట్టగా వాదనల తరువాత 14 రోజుల రిమాండ్ విధించారు. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలో లేకపోయినా..చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మొత్తం సీఎం జగన్ చుట్టూనే తిరిగింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇప్పుడు జగన్ హయాంలో జైలుకు వెళ్లటం హాట్ టాపిక్ గా మారుతోంది.ఆపరేషన్ అపోజీషన్:ఇక, చంద్రబాబు పైన కేసులు..అరెస్ట్ తో ఎన్నికల వేళ సానుభూతిగా మారుతోందని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ, వైసీపీ ముఖ్య నాయకత్వం మాత్రం రాజకీయంగా ఈ అరెస్ట్ కు ప్రాధాన్యత లేదని కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబుకు సానుభూతి అవకాశం లేదనేది వైసీపీ లెక్క. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. టీడీపీ బంద్ కు మద్దతు ప్రకటించారు. అటు ఏపీలో పరిణామాలను కేంద్రంలోని బీజేపీ నాయకత్వం నిశితంగా గమనిస్తోంది.ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే ఇక పూర్తిగా వైనాట్ 175 లక్ష్యంగా ఆపరేషన్ 2024 ప్రారంభానికి భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్లనున్నారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతూ..సొంత పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు.ప్రజల్లోకి సీఎం జగన్:చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పాలనా..పార్టీ పరంగా నిర్ణయాలకు సిద్దమయ్యారు. ఈ వారంలోనే సీఎం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ నేతలు..ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. పాలనలోనూ సంక్షేమం మరింత మందికి అందేలా కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు రంగం సిద్దమైంది. ఇటు రాజకీయంగా పూర్తిగా ప్రజలతో మమేకం అయ్యేలా జగన్ తన సైన్యాన్ని మొహరించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యక్రమం ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో, ఏపీ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది.