యువతా హరితా గో గ్రీన్ ఛాలెంజ్ లో ఎంపీ భరత్

రాజమండ్రి నగరంలో ఎంపీ భరత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న’యువతా హరితా’ గో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం సమాజానికి ఎంతగానో ఉపయోగపడే అద్భుత కార్యక్రమమని బాలివుడ్ సినీ నటి, నెట్ బాల్ కామన్వెల్త్ ఇండియా టీమ్ మాజీ కెప్టెన్ ప్రాచీ టెహలాన్ కొనియాడారు. శనివారం ఉదయం రాజమండ్రి నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డు ముగ్ద షాపింగ్ మాల్ వద్ద ఎంపీ భరత్‌ ఆధ్వర్యంలో ‘గో గ్రీన్ ఛాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి నటి ప్రాచీ టెహలాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏవీఏ అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్ వద్ద డివైడర్లో వివిధ రకాల మొక్కలను ఎంపీ భరత్, నటి ప్రాచీ టెహలాన్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సంయుక్తంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నటి ప్రాచీ టెహలాన్ మాట్లాడుతూ నా పేరుతో పవిత్ర రాజమండ్రి నగరంలో ఒక మొక్క స్వయంగా నేను నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దూరదృష్టితో ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎంపీ భరత్ ఈ కార్యక్రమం మహోద్యమంగా చేపట్టడాన్ని ప్రతీ ఒక్కరూ అభినందించాలని, యువత ఇటువంటి కార్యక్రమాలలో ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక్కడ యువత, విద్యార్థులు ఎంపీ భరత్ పై చూపిస్తున్న అభిమానం చూస్తుంటే ఈ నగరంలో ఆయన చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆదరిస్తున్నారని అర్ధం అవుతోందన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో రాజమండ్రి నగరంలో ‘గో గ్రీన్ ఛాలెంజ్’ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మానవాళికి ప్రాణాధారమైన‌ స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం ప్రతీ ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. గో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరాన్ని అందమైన హరిత నగరంగా తీర్చిదిద్దాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. నటి ప్రాచీ టెహలాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధికి మరో పేరు ఎంపీ మార్గాని భరత్ రామ్ అని అభివర్ణించారు. నగరంలో ప్రస్తుతం చేపట్టిన హరిత- యువత కార్యక్రమం భవిష్యత్తులో ప్రజలంతా దీని ప్రయోజనం తప్పక పొందుతారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలలో ప్రతీ ఒక్కరూ పాల్గొని, లక్ష్య సాధన దిశగా తీసుకు వెళ్ళాలని కోరారు. తొలుత నటి ప్రాచీ టెహలాన్, ఎంపీ భరత్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these