ఏపీలో అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులు ప్రస్తుతం అసంతృప్తి స్వరాలను చాలా తీవ్రస్థాయిలో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ నాయకుల్లో పదవుల మీద ఆశలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే వారి నియోజకవర్గాల్లో ప్రస్తుతం పదవిలో ఉన్నవారి వెనుక గోతులు తవ్వడం, వారిని ఓడించే ప్రతిజ్ఞ చేస్తే తమకు ఆదరణ పెరుగుతుందనే నమ్మకం లాంటి పెడకపోకడలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. వీటిలో చాలా సీరియస్ వ్యవహారంగా ఎంచదగినది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు.
అయితే అక్కడ మంత్రి వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడించి తీరుతాం అంటూ పిల్లి సుభాష్ వర్గం ప్రకటించింది. ఆయన కొడుకు సూర్య ప్రకాష్ ఒక అడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, పార్టీ టిక్కెటు మీద పోటీచేస్తానా? లేదా, ఇండిపెండెంట్ గానా? అనేది అప్పటికి తేలుస్తానని తెలిపారు. ఈ రకంగా వ్యవహారం ముదిరి పాకాన పడడంతో సీఎం జగన్ పిల్లి సుభాష్ ను పిలిపించి మాట్లాడారు. అంతేకాకుండా జగన్ సుభాష్ ను మందలించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకు భవిష్యత్తుకు తాను హామీ అని మాట ఇచ్చినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పిల్లి సుభాష్ జగన్ తో భేటీ తర్వాత మౌనంగా వెళ్లిపోయి, తాజాగా తిరుగుబాటు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే గనుక తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీచేస్తానని హెచ్చరిస్తున్నారు.
అయితే పిల్లి ఇలాంటి ఎత్తుగడతో గతంలో కూడా తన పంతం సాధించుకున్నారు. వైఎస్సార్ హయాంలో తనకు టికెట్ దక్కలేదు. వైఎస్సార్ కు ఎంతో దగ్గరి నాయకుడే అయినప్పటికీ టికెట్ దక్కలేదు. దాంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ పిలిచి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేయాలని పిల్లి అనుకుంటున్నట్టుగా ఉంది. తనంత తాను గెలిస్తే తర్వాత జగన్ పిలిచి పార్టీలో మళ్లీ చేర్చుకుని కేబినెట్ లో పెద్ద పీట వేస్తారని ఆశపడుతున్నట్టుగా ఉంది. కానీ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ లాగా కాదు అనే సంగతి పిల్లికి తెలియనట్లుగా ఉంది. అప్పట్లో టికెట్ ఇప్పించలేకపోయినప్పటికీ తనకు దగ్గరివాడైన పిల్లి సుభాష్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంటుగా గెలవడానికి వైసీపీ సాయం చేశారనే ప్రచారం కూడా ఉంది. కానీ జగన్ అలా వ్యవహరించే రకం కాదు. ఒకవేళ చచ్చీ చెడీ గెలిచినా సరే మళ్లీ పిలిచి పార్టీలో పెద్దపీట వేసే రకం కూడా కాదు. మరి ఇప్పటికైనా పిల్లి సుభాష్ ఈ విషయం తెలుసుకుంటే మంచిది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదు కూడదు అని పంతానికి పోతే మాత్రం రాజకీయ సమాధి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.