‘తూర్పు’లో పవన్ వారాహి యాత్ర తీరూ తెన్నూ…
జనసేనాని వారాహి విజయ యాత్ర అవిభజిత తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి. ’వారాహి’ని లేటుగా ప్రారంభించినా రాజకీయవర్గాల దృష్టిని ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రతో పోలిస్తే పవన్ యాత్రకు బాగానే స్పందన వచ్చింది. పన్నెండు రోజులపాటు రాజమండ్రి, కాకినాడ, డా.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. చేనేత, మత్స్యకార, వెనుకబడిన వర్గాలతో పాటు ముస్లింలతో కూడా భేటీ అయ్యారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని గతంలో చేసిన పవన్ ప్రకటనలకు భిన్నంగా ‘వారాహి’ ముందుకు వెళ్లింది. జనమంతా ఓట్లేసి తనను సీఎం చేయాలని పవన్ రెండో రోజే ప్రకటించడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిమీద తెలుగుదేశం నాయకులు టీవీ చర్చల్లో మండి పడ్డారు. ‘అసెంబ్లీ గేటు దాటలేని వాళ్లు సీఎం ఎలా అవుతారం’టూ నిలదీశారు. ఓ రెండ్రోజుల తర్వాత మళ్లీ పవన్ మాట మార్చారు. తాను గెలుస్తానని ఖచ్చితంగా చెప్పలేనని, అందరూ సంఘటితం కాకపోతే వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుందని తన భయాన్ని వ్యక్తం చేశారు.