రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఏ ఉదంతమైనా సరే.. ఆ వెంటనే సినిమాగా ప్రకటించే దర్శకుల్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుంటారు.అయితే.. ఆయన ఈ విషయంలో తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా విశాఖ వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి.. చిత్ర హింసలకు గురి చేసిన వైనం.. రోజుల తరబడి సాగిన కిడ్నాప్ ఎపిసోడ్ ను పోలీసులు ఛేదించటంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అధికారపార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయటం.. కుర్రాడైన ఎంపీ కుమారుడు కిడ్నాపర్ల దెబ్బకు భయపడి వణికిపోవటం దగ్గర నుంచి.. ఈ కిడ్నాప్ వ్యవహరంలో ఒక సినిమాకు అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయి.
పాత ఆర్జీవీ అయితే.. ఎవరితోనూ సంబంధం లేకుండా.. ఈ అంశాన్ని సినిమాగా తీస్తున్నట్లుగా ప్రకటించేవారు. తన అభిప్రాయాల్ని ట్వీట్ల రూపంలో వెల్లడించేవారు. ప్రభుత్వాన్ని.. పోలీసు అధికారులపైనా తనకు ఇష్టం వచ్చిన రీతిలో రియాక్టు అవుతూ.. పంచ్ ట్వీట్లను వరుసపెట్టేసేవారు.
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. అంతులేని మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమాకు అవసరమైన అన్ని ఎలిమెంట్లు ఉన్నప్పటికీ.. మౌనంగా ఉండటం చూస్తే.. తాను అభిమానించే పార్టీని ఇబ్బందులకు గురి చేయకూడదన్నట్లుగా వర్మ తీరు ఉందంటున్నారు. నిజానికి అతగాడు సినిమాలుగా తీసిన పలు సంచలన ఉదంతాలకు ఏ మాత్రం తీసినపోని రీతిలో వైసీపీ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఉందన్న మాట వినిపిస్తోంది.
